కేసీఆర్ కుటుంబానికే అన్ని ఉద్యోగాలు

కేసీఆర్ కుటుంబానికే అన్ని ఉద్యోగాలు

ఖమ్మం: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కటుంబానికే అన్ని ఉద్యోగాలు వచ్చాయని, యువతకు నిరాశే మిగిలిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్ర 98వ రోజు ఖ‌మ్మం జిల్లాలోని పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నేలకొండపల్లి కొనసాగుతోంది. అక్కడికి చేరుకున్న షర్మిల చెరుకు రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... కేసీఆర్‌ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఉంటే ప్రజలు మాత్రం అడుక్కు తినాలా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారుడు కదా అని రెండు సార్లు గెలిపిస్తే వెన్నుపోటు పొడిచారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, 57 ఏళ్లకే వృద్ధులకు పింఛన్లు.. ఇలా ఏ హామీని నెరవేర్చకుండా  కేసీఆర్‌ మోసం చేయని వర్గం లేదని ధ్వజమెత్తారు.  ప్రాజెక్టుల పేరుతో రూ.70 వేల కోట్లు దోచు కోవడమే కాక రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు.
ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మొద్దు నిద్రపోతోందని.. ప్రజల పక్షాన నిలబడేందుకే తాను పార్టీ పెట్టినట్లు వివరించారు. తనది వైఎస్సార్ రక్తమని.. ఆశీర్వదిస్తే ఆయన పేరు నిలబెడతానని తెలిపారు.